వైఎస్‌తో హరీశ్‌ భేటీ (Eenadu, 3-6-08)

ప్రాధాన్యం లేదన్న తెరాస నేత
ఫలితాలపై కేసీఆర్‌ మథనం
ఎందుకిలా జరిగింది?
ఎదురుదెబ్బపై ఆవేదన
భావి వ్యూహంపై మంతనాలు

హైదరాబాద్‌ – న్యూస్‌టుడే:

హైదరాబాద్‌ – న్యూస్‌టుడే:

ప్రాంతం: సచివాలయం
స్థలం: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేషీ ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులు ఒక్కొక్కరుగా వైఎస్‌ను కలుస్తున్న సమయం. ఆ సమయంలో అనుకోని కలకలం. రాసలో కీలక నేత హరీశ్‌రావు సీఎం పేషీలో ప్రత్యక్షం.

ఉప ఎన్నికల్లో అనూహ్య పరాజయం చవిచూసిన తెరాస.. ఏమిచేయాలో పాలుపోని స్థితిలో ఉన్న తరుణంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు హరీశ్‌ ఎందుకొచ్చారా అని అక్కడున్న వారందరిలో విస్మయం. అంతలోనే లోపలకు వెళ్లిన హరీశ్‌.. వైఎస్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. పదినిమిషాలకుపైగా ఆయనతో మంతనాలు జరిపారు. వాటి వివరాలు తెలియరాలేదు. హరీశ్‌ మాత్రం ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదంటున్నారు. తన సిద్దిపేట నియోజకవర్గంలో మహిళా డిగ్రీ కళాశాల గురించి మాట్లాడేందుకే వెళ్లానని చెబుతున్నారు. నియోజకవర్గంలో రహదారులకు సంబంధించి మంత్రి దివాకరరెడ్డిని కలిసి.. పనిలోపనిగా ముఖ్యమంత్రినీ కలిశానని అన్నారు. అయితే హరీశ్‌ సచివాలయ యాత్ర సమయాన్ని, తెరాసలో పరిస్థితిని పరిశీలిస్తే ముఖ్యమంత్రితో ఆయన భేటీ వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

పరాజయాలపై కేసీఆర్‌ మథనం
వూహించని ఎదురుదెబ్బ తగలడంతో తెరాస అధినేత కేసీఆర్‌ గత రెండురోజుల్లో ఇల్లు దాటి బయటకు రాలేదు. ముఖ్యులైన కొంతమంది నేతలు మాత్రమే ఆయన్ను కలుస్తున్నారు. ఫలితాలు ఈ విధంగా ఎందుకొచ్చాయనే విషయంలో కేసీఆర్‌ తీవ్రంగా మథనపడుతున్నారు. ఉద్యమాన్ని బాగా నిర్మించి తుది దశకు తీసుకెళ్లామని అనుకుంటున్న పరిస్థితుల్లో ఇలాంటి ఎదురుదెబ్బ తగిలిందేమిటని ఆయన ఆవేదన చెందుతున్నారు. ఉప ఎన్నికల్లో 12 సీట్లయినా గెలిచి తెలంగాణ ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెద్దామనే తన వ్యూహం ఎందుకు బెడిసికొట్టిందో తెలియక ఒత్తిడికి లోనవుతున్నారు. సహజంగా వ్యూహాలు పన్నడంలో కేసీఆర్‌ను దిట్టగా భావిస్తారు. అదే విధంగా ఆయన రాజకీయ విశ్లేషణలు కూడా బాగా చేస్తారనే పేరుంది. అలాంటి కేసీఆర్‌ గత రెండురోజులుగా నేతలతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఫలితాల తీరుపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. ‘ప్రజలు తెరాసను తిరస్కరించలేదు. అలాగని పూర్తిగా ఆశీర్వదించనూలేదు. అభ్యర్థులపై వ్యతిరేకతే పనిచేసిందనుకుంటే అటువంటి పేరున్న వారందరూ ఓడిపోలేదు. బాగా వ్యతిరేకత ఉన్న వారు కూడా మంచి మెజారిటీతో గెలిచారు. ఎటువంటి వ్యతిరేకత లేని డిచ్‌పల్లిలాంటి చోట్ల మూడో స్థానంలోకి వెళ్లాం. ఇదెలా సాధ్యం? ఎందుకిలా జరిగింది’ అనేది ప్రధానంగా చర్చకు వస్తున్నట్లు తెలిసింది. ఇలాంటప్పుడు తాను ఉద్యమ నేతగా ఉండడం ఎందుకనే మాట కూడా కేసీఆర్‌ నుంచి వస్తోందని, అయితే జయశంకర్‌ సహా పార్టీ ముఖ్యనేతలంతా దాన్ని పూర్తిగా తోసిపుచ్చుతున్నారని సమాచారం. అలాగైతే భవిష్యత్తులో ఎలాంటి పంథా అవలంబించాలనే దానిపై కేసీఆర్‌ సీనియర్ల సూచనలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే హరీశ్‌రావు కూడా సోమవారం కేసీఆర్‌తో విడిగా కొద్దిసేపు మంతనాలు జరిపారు. ఆ తర్వాతే ఆయన సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రితో భేటీ అవడం గమనార్హం. ఈ పరిణామానికి కొద్ది గంటల ముందే వైఎస్‌.. తెరాస ఇప్పటికీ తమ సన్నిహిత భాగస్వామి అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హరీశ్‌ సీఎం పేషీకి రావడానికి రాజకీయ ప్రాధాన్యం ఉందనేది స్పష్టమవుతోంది. మరి ఆయన తనంత తానుగా వచ్చి వైఎస్‌ను కలిశారా? లేక కేసీఆర్‌తో మంతనాల పర్యవసానంగా కలిశారా అన్నది అంతు చిక్కడంలేదు. హరీశ్‌, వైఎస్‌ల చర్చలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో తెలియరావడం లేదు. దీనిపై ‘న్యూస్‌టుడే’ హరీశ్‌ను సంప్రదించగా.. ‘నేను అసెంబ్లీలో వైఎస్‌కు వ్యతిరేకంగా నాలుగేళ్ల పాటు రాజీలేని పోరాటం చేశాను. తెలంగాణ ఉద్యమంలో ఉద్ధృత భాగస్వామినైన నాకు ఎటువంటి ఇతర ఉద్దేశాలు లేవు’ అని బదులిచ్చారు.

Leave a Comment