‘వెలుగు’దేశంతో ముప్పే (Eenadu, 3-6-08)

తెలంగాణలో తెదేపాకు ఇంత బలమా?
ఇది మన పార్టీకి హెచ్చరికే
ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ పెద్దల విశ్లేషణ!
అధిష్ఠానం దృష్టీ దీనిపైనే

హైదరాబాద్‌ – న్యూస్‌టుడే: ‘తెలుగుదేశం పార్టీకి 2004 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓట్లశాతం తగ్గింది. ఆ పార్టీకి నిజంగా పాత బలమే ఉంటే మొత్తం స్థానాలను గెల్చుకుని ఉండేది. కానీ ఆ పార్టీ బలహీనపడింది’

- ఇది ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సహా కాంగ్రెస్‌ వర్గాలు తెదేపా విషయంలో పైకి చెబుతున్న విశ్లేషణ

‘తెలుగుదేశం పార్టీ పని ఇక అయిపోతోందని అనుకుంటుంటే.. ఇదేంటి? ఆ పార్టీ తెలంగాణలో ఇంత బలంగా ఉంది. భవిష్యత్తులో తెదేపాతో ముప్పే’

- ఇది కాంగ్రెస్‌ పెద్దల్లో అంతర్గతంగా జరుగుతున్న చర్చ

ప ఎన్నికలతో కొత్త వెలుగు సంతరించుకున్న తెలుగుదేశంపై కాంగ్రెస్‌ ఆలోచనలో పడింది. తెలంగాణ ప్రాంతంలో నాలుగు అసెంబ్లీ, ఓ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఆ పార్టీ గెల్చుకోవడంతోపాటు అనేక చోట్ల ఢీ అంటే ఢీ అనడాన్ని తక్కువగా చూడరాదని భావిస్తోంది. తెదేపాకి ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఇచ్చిన టానిక్‌ రాష్ట్రంలో మరింత బలపడేందుకు దోహదపడుతుందనే అభిప్రాయం కాంగ్రెస్‌ వర్గాల్లో వినవస్తోంది. ఉప ఎన్నికల్లో తెరాస దెబ్బతిన్నదనే విషయం కాంగ్రెస్‌లో ఎంత ఆనందాన్ని నింపుతోందో.. తెదేపా పుంజుకుందనే అంశం అంతే బాధిస్తోంది. ‘తెరాసకు కొన్ని సీట్లు వచ్చినా మాకు ఇబ్బందిలేదు. అదంతా తెలంగాణ సెంటిమెంట్‌ బలం తప్ప.. మాకు వ్యతిరేకత లేదని చెప్పుకుంటాం. కానీ తెదేపా సీట్లు గెల్చుకుంది. చాలాచోట్ల ఆ పార్టీయే మమ్మల్ని సవాల్‌ చేసింది. పార్టీ అధిష్ఠానం ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. దీనిపైనే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. తెదేపాకు మంచి ఫలితాలు రావడమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది కాంగ్రెస్‌కు హెచ్చరికలాంటిదే’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు విశ్లేషించారు.

తప్పిన అంచనాలు
ఉప ఎన్నికల ముందు వరకు తెదేపా చాలా ఇబ్బందుల్లో ఉందనేది కాంగ్రెస్‌ భావన. తెలంగాణ అంశంలో తమకు అధిష్ఠానం ఢిల్లీలో ఉంటుంది కాబట్టి రెండు రకాలుగా మాట్లాడే వీలుంటుందని, తెదేపాకు ఆ వెసులుబాటు లేదని కాంగ్రెస్‌ భావిస్తూ వచ్చింది. ఆ అంశం ప్రాతిపదికన జరుగుతున్న ఉప ఎన్నికల్లో తెదేపా గట్టి దెబ్బ తింటోందని, దాని ప్రభావం కోస్తా, రాయలసీమల్లోనూ పనిచేసి తమకు లైన్‌ క్లియర్‌ అవుతుందని కాంగ్రెస్‌ పెద్దలు ఊహించారు. వాస్తవానికి ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలు తెదేపాకు సంప్రదాయ స్థానాలే. గతంలో అనేకసార్లు తెదేపా ఆ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించింది. అధికారం కోల్పోయాక ఆ నియోజకవర్గాల్లో తెదేపా బాగా బలహీనపడిందని కాంగ్రెస్‌ భావించింది. అధికారం అండతో ఇతరత్రా ఆశలుజూపి తెదేపా క్యాడర్‌ను తమవైపుకు తిప్పుకునే వ్యూహాలు కూడా పన్నింది. వీటన్నింటి వల్ల పోలింగ్‌ నాటికి తెదేపా బాగా డీలా పడుతుందని ఆశించింది. ఉప ఎన్నికల్లో తెదేపా బాగా దెబ్బతింటే కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఆ పార్టీ శ్రేణులు కొత్త పార్టీవైపు ఆకర్షితులవుతాయని కొందరు కాంగ్రెస్‌ నేతలు విశ్లేషణ చేశారు. ఆ విధంగా రాష్ట్రం మొత్తంలో తెదేపా కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ఊహించుకున్నారు. ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తీర్పు వారి కలలను కల్లలు చేసింది.

ఇక ‘మీ కోసం’పై దృష్టి!
మొదట్లో తెదేపా బలంగా ఉన్నా పోలింగ్‌ నాటికి ఆ పార్టీ శ్రేణులు జారిపోతాయని తెరాస కూడా భావించింది. ఉప ఎన్నికల తరువాత ఎన్టీఆర్‌ భవన్‌ మూతపడడం ఖాయమని కేసీఆర్‌ ప్రకటించారు. వీటన్నింటినీ తల్లకిందులు చేస్తూ తెదేపా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోను తన ప్రభావం చాటుకుంది. కొన్ని చోట్ల ఆ పార్టీ దెబ్బకు ఇటు కాంగ్రెస్‌, అటు తెరాస కూడా కంగుతిన్నాయి.తెలంగాణలో ఖైరతాబాద్‌ మినహాయిస్తే 40 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రజలు తీర్పునిచ్చారు. మొత్తంమీద 45.44 లక్షల ఓట్లు పోలవగా కాంగ్రెస్‌కు 15.45 లక్షలు, తెరాసకు 14.25 లక్షలు, తెదేపాకు 12.92 లక్షల ఓట్లు లభించాయి. తెలంగాణలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీపడిన తెదేపా నాలుగు చోట్ల గెలిచి.. ఐదు చోట్ల రెండోస్థానంలో నిలిచింది. అంటే 16లో తొమ్మిది చోట్ల ప్రధాన ప్రత్యర్థి తెదేపాయే. నాలుగులో రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లోను ఇదే పరిస్థితి. ఈ ఉప ఎన్నికల తర్వాత తెదేపాలో తమకనుకూలమైన పరిణామాలు నెలకొంటాయని ఆశపడ్డ కాంగ్రెస్‌ భంగపడింది. ఫలితాల దృష్ట్యా చంద్రబాబు చేస్తున్న ‘మీకోసం’ యాత్రపై పార్టీ మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారు. ఈ ఫలితాలు ఇటు తెలంగాణలోను, అటు కోస్తా, రాయలసీమల్లోను తెదేపా శ్రేణుల్లో ఆత్మస్త్థెర్యం నింపుతాయనే వాదనను వారు అంగీకరించకుండా ఉండలేకపోతున్నారు.


Leave a Comment