హైదరాబాద్, జూన్ 2 (ఆన్‌లైన్): ఉప ఎన్నికల్లో పార్టీ అనూహ్యంగా ఓటమిపాలు కావడంతో తీవ్ర ఒత్తిడికి గురైన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు రెండో రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి రాలేదు. పార్టీ ముఖ్య నేతలను, అభ్యర్థులను, కొందరు ప్రముఖులను తప్ప మరెవరినీ కలుసుకోలేదు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డాక్టర్ నగేశ్, రామలింగారెడ్డి, టి.హరీశ్‌రావు తదితరులు ఆయన్ని కలిసి చాలాసేపు మాట్లాడారు. తెలంగాణ విద్యావంతులు ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి, నందినీ సిద్ధారెడ్డి, దేశపతి శ్రీనివాస్‌లు సైతం ఆయనను కలిసి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.
పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనను కేసీఆర్ విరమించుకున్నట్లు తెలిసింది. వీలైనంత త్వరలో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలూ తీసుకుని పార్టీ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించాలన్న యోచనలో ఆయన ఉన్నారు. వెనుదిరిగిన ఈటెల నిరంతరం పార్టీ నేతలు, వివిధ జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలతో కిటకిటలాడే తెలంగాణ భవన్ ఉప ఎన్నికల ఫలితాలతో సోమవారం బోసిపోయింది.
పార్టీ నేత టి.హరీశ్‌రావు వచ్చినపుడు పెద్దసంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, నేతలు మినహాయించి మిగిలిన సమయం అంతా ఖాళీగానే కనిపించింది. అసెంబ్లీ ఆవరణలో గల టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయం పరిస్థితీ ఇంతే. మధ్యాహ్నం తర్వాత గానీ ఆ కార్యాలయం తెరవలేదు. ఉదయం 11.45గంటల ప్రాంతంలో ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటెల రాజేందర్ అక్కడకు వచ్చారు. అయితే కార్యాలయం మూసి ఉండడంతో వెనుదిరిగి పోయారు.
ఆ క్రమంలో కిందనే ఉన్న సీఎల్పీ కార్యాలయం ముందు ఆయన కొద్దిసేపు నిలబడ్డారు. అక్కడే ఉన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ కిరణ్‌కుమార్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ తదితర నేతలు వచ్చి రాజేందర్‌ను అభినందించారు. పాల్‌కు టీఆర్‌ఎస్ కృతజ్ఞతలు ఉప ఎన్నికల్లో తమకు మద్ధతు పలికిన క్రైస్తవ మత బోధకుడు కె.ఎ.పాల్‌కు టీఆర్‌ఎస్ కృతజ్ఞతలు తెలిపింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు, జి.నగేశ్ తదితరులు పాల్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఉప ఎన్నికల్లో తెలంగాణవాదులు గెలిచారని పాల్ వ్యాఖ్యానించారు.
Posted by telanganabyelections on June 3, 2008 at 8:52 am
Filed under: Andhrajyothy, news Papers  |
| Trackback URI