టీఆర్‌ఎస్‌తో పొత్తుకు నో చెప్పలేను: వై ఎస్‌ (Andhrajyothy, 3-6-08)

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆన్‌లైన్‌): తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు విషయమై ముఖ్యమంత్రి మరోసారి సానుకూల సంకేతాలు పంపారు. ఒక ప్రైవేటు చానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు మళ్లీ ఉంటుందా అని ప్రశ్నించగా ‘నో’ అని మాత్రం చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు. ఇదే ప్రశ్న బీజేపీ గురించి.. తెలుగుదేశం గురించి అడిగితే నో అని వెంటనే చెప్పగలను.. కానీ టీఆర్‌ఎస్‌ విషయంలో అలా కాదు.

 రాజకీయాలలో ఏదైనా సాధ్యమేనని అన్నారు. 25 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ గెలవని సీట్లలో ఈసారి ప్రజలకు కాంగ్రెస్‌కు పట్టం కట్టడం గొప్ప ఆనందాన్ని ఇస్తున్నదని తెలిపారు. ఏకాభిప్రాయం ద్వారా మాత్రమే తెలంగాణ సాధ్యమని తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నామని ఇటీవల కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో కూడా ఈ ప్రస్తావన వచ్చిందని ఆయన చెప్పారు.

కరీంనగర్‌లో కేసీఆర్‌ మెజారిటీని 2 లక్షల నుంచి 15 వేలకు తగ్గించిన జీవన్‌రెడ్డిని మళ్లీ మంత్రి పదవి అప్పజెప్పనున్నామని సీఎం చెప్పారు. ఉపఎన్నికలలో పనితీరు ఆధారంగా కొందరికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికే అవకాశం కూడా ఉన్నట్టు సూచనప్రాయంగా వెల్లడించారు. వారి స్థానంలో కొత్తవారికి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ప్రజల్లో కాంగ్రెస్‌ పట్ల విశ్వసనీయత గణనీయంగా పెరిగిందన్న విషయం ఈ ఉప ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమైందని పేర్కొన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదన్న విషయం కూడా తేలిపోయిందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న బలహీనతలు కూడా తెలిసొచ్చాయని వాటిని సవరించుకుంటామన్నారు.

Leave a Comment