జీతేగా భాజపా జీతేగా భారత్‌ (Eenadu, 3-6-08)

అద్వానీ సరికొత్త నినాదం

న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: అత్యంత బలహీనమైన యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాలన స్తంభించి పోయిందని భాజపా అగ్రనేత ఎల్‌.కె.అద్వానీ వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలకే ముప్పుగా పరిణమించిన ఈ సర్కారును తక్షణమే గద్దె దింపాలని పిలుపునిచ్చారు. కర్ణాటక విజయోత్సాహంలో ఉన్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం చివరిరోజు ప్రధాని అభ్యర్థి అద్వానీ పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘జీతేగా భాజపా, జీతేగా భారత్‌’ అని కొత్త నినాదాన్ని ఇచ్చారు. ”వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మనమే ముందంజలో ఉంటాం. అది చాలదు. స్పష్టమైన విజేతగా నిలవాలి” అని పిలుపునిచ్చారు.

 

భాజపా ముఖ్యమంత్రులు, సీనియర్‌ నేతలు వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను సీరియస్‌గా తీసుకొని, విజయం కోసం నడుం బిగించాలని అద్వానీ కోరారు. కాంగ్రెస్‌ నానాటికీ కుంచించుకుపోతోందని, యూపీఏను 2009లో రద్దు చేస్తారని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రికి మంత్రివర్గ సహచరుల మీద కానీ, అధికార యంత్రాంగం మీద గానీ ఎప్పుడూ అదుపు లేదన్నారు. వ్యవసాయ రుణాల రద్దు ఆలస్యంగా ఇచ్చిన నొప్పి నివారణ మాత్రేకానీ, శాశ్వత పరిష్కారం కాదన్నారు.

కర్ణాటక విజయం భాజపాకు మానసికంగా ఎంతో బలాన్ని ఇచ్చిందని, దేశవ్యాప్తంగా పార్టీ నైతిక స్త్థెర్యాన్ని పెంచిందని అద్వానీ చెప్పారు. కర్ణాటక తీర్పు కాంగ్రెస్‌కు శరాఘాతమని, ఆ పార్టీ తీవ్ర విషాదంలో మునిగిపోయిందని వ్యాఖ్యానించారు. ఇది భారత రాజకీయాల్లో మేలి మలుపని అన్నారు. కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా క్రమంగా కుంచించుకు పోతోందని, బలహీన ప్రభుత్వం, శక్తిలేని ప్రధాని, అవకాశవాద కాంగ్రెస్‌-వామపక్ష ఒప్పందం దేశాన్నెలా ప్రమాదంలో పడేస్తున్నాయో ఓటర్లు గ్రహిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘యూపీఏ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎంత అస్తవ్యస్థం చేసిందంటే పేదలే కాకుండా మధ్యతరగతి కూడా ద్రవ్యోల్బణం కారణంగా కొనుగోలు శక్తిని కోల్పోయారు’ అని వ్యాఖ్యానించారు.

యూపీఏ ప్రభుత్వం అంతర్గత భద్రతను గాలికి వదిలేసిందని, గత నాలుగేళ్లలో జరిగిన ఒక్క ఉగ్రవాద సంఘటనపై దర్యాప్తు కూడా కొలిక్కి రాలేదని అద్వానీ విమర్శించారు. ”యూపీఏ ప్రభుత్వం తప్పుల తడక అయిన అణు ఒప్పందం ద్వారా వ్యూహాత్మక రక్షణ సత్తా విషయంలో భారత దేశాన్ని నిరాయుధీకరించాలని యోచిస్తోందా? అన్న అనుమానం వస్తోంది. భాజపా పునరుత్థానం మన కోరిక మాత్రమే కాదు. భారత ప్రజాస్వామ్యం, అభివృద్ధిల ఆవశ్యకత కూడా” అన్నారు. మెరుగైన ఎన్నికల వ్యూహం, ప్రచారాలతో 1999లో సాధించిన 182 సీట్లకన్నా ఎక్కువ సీట్లు సాధించేందుకు పార్టీ నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

”పార్లమెంటు ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారం జరిగితే ఫిబ్రవరిలో లోక్‌సభను రద్దు చేస్తారు. జూన్‌-ఫిబ్రవరిలకు మధ్య 272 రోజులు ఉన్నాయి. ఈ అంకె ప్రత్యేకత ఏమిటో మీ అందరికీ తెలుసు” అన్నారు.భాజపాకు సొంతంగా సాధారణ మెజారిటీ సాధించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

సమావేశం అనంతరం వివరాలను పార్టీ అధికార ప్రతినిధి రవిశంకర్‌ ప్రసాద్‌ విలేకరులకు వెల్లడించారు. ఇప్పటికే 159 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులుగా ప్రకటించదగిన నేతల పేర్లు, స్థానికంగా లేవనెత్తాల్సిన అంశాల నివేదికలు సిద్ధమయ్యాయని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన కమిటీలను 2008 జూన్‌కల్లా పూర్తి చేయాలని, అభ్యర్థుల జాబితాలను పంపాలని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ ఆదేశించారు. ఆహార ధాన్యాలు, విద్యుత్‌ కోటాల విషయంలో భాజపా పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని పార్టీ ముఖ్యమంత్రులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.

నేపాల్లో మావోయిస్టుల పాలన దేశ భద్రతకు ముప్పని భాజపా వ్యాఖ్యానించింది. 601 సీట్లున్న సభలో 210 సీట్లున్న మావోయిస్టులు సుస్థిర పాలన అందించలేరని, ఆ దేశంలో పరిణామాలు కలవరం కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొంది. బంగ్లాదేశ్‌ ఉగ్రవాదుల కేంద్రంగా మారిందని జశ్వంత్‌ వ్యాఖ్యానించారు.

Leave a Comment