మేడారం ఓటమిపై వైఎస్ వర్గీయులు గరంగరం
అధిష్ఠానానికి ఫిర్యాదుచేసేందుకు సమాయత్తం
కరీంనగర్, న్యూస్‌టుడే: కాంగ్రెస్ విధాన నిర్ణాయక కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో తెలంగానం ఆలపించి కలకలం సృష్టించిన సీనియర్ నేత జి.వెంకటస్వామిని ఇరుకునపెట్టేందుకు వైఎస్ వర్గీయులు రంగం సిద్ధం చేశారు. కరీంనగర్ జిల్లా మేడారంలో కాంగ్రెస్ అభ్యర్థి కుమారస్వామి ఓటమికి ఆయన వైఖరే కారణమన్న ఆరోపణతో అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. నిజానికి మేడారం (ఎస్సీ) స్థానం కాకా ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
అక్కడ కాంగ్రెస్ గెలవాలంటే ఆయన తనయుడు జి.వివేక్‌ను బరిలోకి దించాలని ఒత్తిడి తెచ్చారు. అధిష్ఠానంతోనూ చెప్పించారు. కాకా అంగకరించలేదు. తెరాస చేతుల్లో తనయుడు ఓటమి పాలైతే ఆయన భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందన్న భయమే దానికి కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థిని అన్వేషించే బాధ్యతను అప్పటి మంత్రి టి.జీవన్‌రెడ్డి, దేవాదాయ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావులకు ముఖ్యమంత్రి వైఎస్, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌లు అప్పగించారు. వారు శ్రేణుల అభిప్రాయాలను సేకరించి.. ధర్మారం జడ్పీటీసీ సభ్యుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను మేడారం అభ్యర్థిగా ఎంపిక చేయాలని వైఎస్, డీఎస్‌లకు సిఫార్సు చేశారు. లక్ష్మణ్‌కుమార్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయాలని సూచిస్తూ డీఎస్ అధిష్ఠానానికి నివేదిక పంపారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే సమయంలో కాకా రంగప్రవేశం చేశారు. ‘నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలోని స్థానానికి నా అభిప్రాయం తీసుకోకుండా ఎలా అభ్యర్థిని ఎంపిక చేస్తారు’ అని అధిష్ఠానాన్ని నిలదీశారు. చివరకు ఆయన సూచించిన వ్యక్తినే అభ్యర్థిని చేయాలని నాయకత్వానికి వైఎస్, డీఎస్ సూచించారు. ‘గెలిపించే బాధ్యతను కూడా ఆయనకే కట్టబెట్టాలి’ అని మెలికపెట్టారు. ఫలితంగా కాకా వర్గీయుడైన గుమ్మడి కుమారస్వామికి టికెట్ లభించింది. అధిష్ఠానానికి ఇచ్చిన మాట మేరకు ఆయన్ను గెలిపించే బాధ్యతను కాకా తన భుజాలకెత్తుకోవడంతో, ఉపఎన్నికల ప్రచారంలోకి ఆయన్ను దించాలన్న వైఎస్ లక్ష్యం నెరవేరింది. ప్రచారంలో కాకా తెలంగానం ఆలపించి.. ‘కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణ తెస్తా. జై తెలంగాణ’ అంటూ నినదించారు. కానీ కుమారస్వామి ఓటమిపాలయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలు వెలువడటానికి సరిగ్గా ఒక్క రోజు ముందు.. ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాకా తెలంగానం చేశారు. పట్టించుకోవడం లేదంటూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయేందుకు కూడా సిద్ధమయ్యారు. సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్ బుజ్జగించడంతో వెనక్కితగ్గారు. కాకా తీరు వైఎస్‌ను ఆగ్రహానికి గురిచేసింది.. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకోవడంతో తనను అభినందించడానికి ఫోన్ చేసిన వెంకటస్వామిపై ఎదురుదాడికి దిగారు. ఇది సీఎం వర్గీయులకు అస్త్రంగా మారింది. మేడారంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే.. భవిష్యత్తులో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిత్వానికి తన కుమారుడు వివేక్‌కు అతడు ప్రధాన పోటీదారు అవుతాడని భావించడం వల్లే, అక్కడ డమ్మీ అభ్యర్థిని కాకా బరిలోకి దించారని వారు ఆరోపణలకు దిగారు. ‘పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలో ఎస్సీల్లోనే ఓ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. వారిని కాదని 1952 నుంచి వేరే సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ ఇస్తున్నారు. ఈసారి అధికంగా ఉన్న వర్గంవారికే టికెట్ ఇవ్వాలని అధిష్ఠానం భావించింది. కాకా దక్కనివ్వకుండా చేశారు’ అని సీఎం వర్గానికి చెందిన ఓ కీలక నేత ‘న్యూస్‌టుడే’తో అన్నారు. ఇందులోని ఆంతర్యం తన కుమారుడి భవితకు ఢోకా ఉండకూడదని ఆయన భావించడమేనని మరో నాయకుడు వ్యాఖ్యానించారు. ఈ నాయకుడు ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడే దాకా కాకాకు సన్నిహితుడుగా పేరుపడిన వాడే కావడం గమనార్హం. వెంకటస్వామి వైఖరిని అధిష్ఠానం ముందు ఎండగట్టేందుకు ఓ మంత్రి నేతృత్వంలో తాము ఢిల్లీ వెళ్తున్నామని వారు చెప్పారు. అధిష్ఠానంతో భేటీకి సమయం తీసుకునేందుకు ఆ మంత్రి ప్రయత్నిస్తున్నారని, అనుమతి రాగానే ఢిల్లీ వెళ్తామన్నారు.
Posted by telanganabyelections on June 3, 2008 at 7:27 am
Filed under: Eenadu, news Papers  |
| Trackback URI