ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి లాజరస్ డిమాండ్
గాంధీభవన్‌లో నిరాహారదీక్ష; అరెస్టు
సీనియర్లకు సెగ: ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో ఉబ్బితబ్బిబ్బవుతున్న ముఖ్యమంత్రి వైఎస్ వర్గీయులు.. ఇప్పుడు స్వపక్షంలోని వ్యతిరేకులపై దృష్టి సారించారు. కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థుల ఓటమికి కారకుంలంటూ కొందరు సీనియర్లను ఇరుకునపెట్టే వ్యూహాలకు శ్రీకారం చుట్టారు. నల్గొండ జిల్లా ఆలేరులో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి అధ్యక్షుడు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి లాజరస్ విజయానికి కృషిచేయలేదని, ఆయన్ను పార్టీ నుంచి సాగనంపాలని రాష్ట్ర మంత్రి దామోదరరెడ్డి డిమాండ్ చేయగా.. లాజరస్ సోమవారం గాంధీభవన్‌కు వచ్చి ఏకంగా నిరాహారదీక్షకే కూర్చున్నారు. అలాగే అగ్రనేత వెంకటస్వామి కరీంనగర్ జిల్లా మేడారం స్థానంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టకుండా తన కుమారుడి కోసం డమ్మీ అభ్యర్థిని బరిలోకి దించి ఓడిపోయేలా చేశారని వైఎస్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు ఓ రాష్ట్ర మంత్రి నేతృత్వంలో ఢిల్లీ బయల్దేరనున్నారు.
హైదరాబాద్, న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: ఉప ఎన్నికల్లో తెరాసను దెబ్బతీశామని ఆనందడోలికల్లో మునిగి తేలుతున్న కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నందుకు సీనియర్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డిని బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఎస్.లాజరస్ నిరాహారదీక్షకు దిగారు. సోమవారం సుమారు 50 మంది అనుచరులతో హైదరాబాద్‌లోని గాంధీభవన్ వద్ద నిరాహారదీక్ష ప్రారంభించారు. అంతకుముందు అక్కడున్న మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పురుషోత్తంరెడ్డి డబ్బు సంచులకు అమ్ముడుపోయి తెరాసతో కుమ్మక్కయారని అని అందులో పేర్కొన్నారు. ఆలేరులో తనకెలాంటి మద్దతూ ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణవాదానికి ఓటెయ్యాలంటూ బహిరంగంగా ప్రకటనలు చేసిన ఆయన్ను పార్టీ నుంచి తొలగించేంత వరకు దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. ‘నాకు జరిగిన అన్యాయాన్ని గాంధీజీకి విన్నవించాను. ఆయన చూపి అహింసా మార్గంలోనే పోరాటం చేయదలిచాను. అందుకే గాంధీ విగ్రహం పాదాల చెంత దీక్ష చేపట్టాం’ అని అన్నారు. ఉప్పునూతల కలిగించిన నష్టం కేవలం ఆలేరుకే పరిమితం కాలేదని, పార్టీ మొత్తంపై ప్రభావం చూపిందని, నల్గొండ జిల్లాలో ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపారు. తనని గొప్పనాయకుడిగా చెప్పుకొంటూ అధిష్ఠానాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఉప్పునూతలపై కఠిన చర్యలు తీసుకుని నల్గొండ జిల్లాలో పార్టీని కాపాడాలని కోరారు. అయితే రాత్రికల్లా లాజరస్ దీక్షను పోలీసులు భగ్నంచేశారు. ఆయనతో పాటు ఎనిమిది మంది అనుచరులనూ అరెస్టుచేశారు.
ఆ డిమాండ్ అర్థరహితం.. ఉప్పునూతల: తనను పార్టీ నుంచి సాగనంపాలని లాజరస్ చేసిన డిమాండ్‌ను ఉప్పునూతల తోసిపుచ్చారు. ఇది అర్థరహితమని, అసలు ఆలేరులో ఓటమికి తననెలా బాధ్యుడిని చేస్తారని ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. లాజరస్ గత చరిత్రను తవ్వితీశారు. ‘ప్రగతి’ పేరిట పెళ్లిళ్ల స్కీం పెట్టి.. ప్రజలకు డబ్బు తిరిగివ్వకుండా ఆయన మోసగించాడని ఆరోపించారు. ఈయన వల్ల చాలా పెళ్లిళ్లు ఆగిపోయాయని చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం ముందునుంచే నేను రాజకీయాల్లో ఉన్నాను. ఇలాంటి శక్తులు నాకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడతాయి? నా విశ్వసనీయతను ఎలా ప్రశ్నిస్తాయి? ఐదేళ్ల క్రితం ప్రజలు లాజరస్‌పై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. అప్పుడో దవడ పోయింది కూడా. ఆయనంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాంటి వ్యక్తికి టికెట్ ఎలా ఇచ్చారు’ అని ఉప్పునూతల ప్రశ్నించారు.
చిరంజీవితో ఫొటోలు దిగలేదా: తనను సస్పెండ్ చేయాలని మంత్రి దామోదరరెడ్డి చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలను ఉప్పునూతల ప్రస్తావించారు. ‘నేను యాభై ఏళ్లకు ముందునుంచే రాజకీయాల్లో ఉన్నాను. ఎవరేమిటో ప్రజలకు తెలుసు. చిరంజీవి కొత్త పార్టీ పెడుతున్నారని తెలిసి కూడా దామోదరరెడ్డి చిరంజీవితో కలిసి ఫొటోలు దిగారు. తన సినిమా థియేటరు ప్రారంభ సమయంలో చిరంజీవితో కలిసి ఉన్న ప్రకటనలు కూడా ఇచ్చారు’ అని చెప్పారు.
Posted by telanganabyelections on June 3, 2008 at 7:20 am
Filed under: Eenadu, news Papers  |
| Trackback URI