ఈ ఫలితాలు తెలంగానానికి కొలబద్ద కావు(Andhrajyothy, 3-6-08)

కాంగ్రెస్‌పై మా పోరాటం చాలలేదు: దేవేందర్‌

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆన్‌లైన్‌): కాంగ్రెస్‌ తప్పిదాలు, వైఫల్యాలపై తాము చేస్తున్న పోరాటం చాలలేదని, అందుకే ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి కొన్ని సీట్లు లభించాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవేందర్‌ గౌడ్‌ ‘ఆన్‌లైన్‌’తో అన్నారు. “కాంగ్రెస్‌ ఈ ప్రాంతానికి ఇంత ద్రోహం చేసి… లేని అభివృద్ధిని ప్రచారం చేసుకున్నా ఈ మాత్రం స్ధానాలు వచ్చాయి. వాస్తవానికి ఇవి కూడా రాకూడదు.

కాంగ్రెస్‌ దుర్మార్గాలను మేం ఇంతకాలం విస్త­ృతంగా ప్రచారం చేస్తూ వచ్చాం. కానీ ఒకటి రెండు కార్యక్రమాలను చూపి ఆ పార్టీ ప్రజలను మోసం చేయగలిగింది. మరింత పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్‌ చేస్తున్న ద్రోహం, దోపిడీలపై వారికి లోతైన అవగాహన కలిగించాలి. దీనిపై మా పార్టీలో చర్చిస్తాం” అని ఆయన అన్నారు.

ఈ ఎన్నికల్లో ప్రజలు తెలంగాణవాదాన్ని తిరస్కరించినట్లేనా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. “ఫలితాలకు, తెలంగాణవాదానికి సంబంధం ఉందో లేదో చూడాల్సి ఉంది. సమస్య కోణం నుంచి ఆలోచించి నిర్ణయానికి రావాలి తప్ప దానికి ఈ ఎన్నికలను కొలబద్దగా తీసుకోరాదన్నది నా అభిప్రాయం. ప్రజలు ఈ వాదాన్ని పూర్తిగా తిరస్కరించారా…వారి తీర్పునకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నదానిని అధ్యయనం చేయాలి. తెలంగాణవాదం లేనేలేదని అనలేం. మా పార్టీలో మేం ఇంకా చర్చించలేదు. అందరం సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం” అని ఆయన పేర్కొన్నారు.

Leave a Comment